Wednesday, November 5, 2008

హం న సంఝే థే , ఖ్వాబ్ షీషే హై, దునియా పథ్థర్ కీ (నేననుకోలేదు, కల అద్దమని, ఈ లోకం రాయిలాంటిదని)

ఒక చిన్న ప్రమాదం అక్టోబర్ 31న రాత్రి పది గంటలకు ఎం.జీ.బీ.ఎస్. బస్ స్టేషన్ లొ బస్ ఎక్కి నేను హైదరాబాద్ నుండి హన్మకొండ కి బయలుదేరాను. ఎందుకో బస్ ఎక్కే ముందు ఎదో జరగనుంది అని నాకనిపించింది. బస్ లో చివరి నుండి రెండో వరుసలో నేను కిటికీ సీటులో కూర్చున్నాను.
బస్ భువనగిరి కి దగ్గరలో ఉంది. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా ల్యాప్ టాప్ లో పాటలు వింటున్నాను. గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం గారంటే నాకెంతో అభిమానం, నా జీవితంలో ఒకసారైనా ఆ మహానుభావుడిని కలవాలని నా కోరిక. నేను వింటున్న పాట 'గర్దిష్' చిత్రంలోని 'హం న సంఝే థే ' పాట. ఆ పాట వింటూ బాలు గారి స్వరమాధురిలో తేలిపొతున్నాను.
ఆ పాటలో మొదటి చరణం తరువాత మళ్ళీ పల్లవి వినిపిస్తుంది. ఆ పాట పల్లవి ఇది 'హం న సంఝే థే , ఖ్వాబ్ షీషే హై, దునియా పథ్థర్ కీ'. సరిగ్గా అప్పుడే ఎమైందో తెలియదు కాని నా ఎడమ చెంప వైపు చల్లగా గాలి తగిలింది, ఆ తరువాత గమనించా నా ఒంటి పైనా, ల్యాప్ టాప్ మీద చిన్న చిన్న గాజు ముక్కలు, ఒక్కసారిగా ఎడమవైపు చూశా కిటికీ అద్దం ముక్కలైంది. వెంటనే నా ల్యాప్ టాప్ ఆఫ్ చేసాను. బస్ ఆగింది. జరిగింది ఎమిటంటే ఎడమ వైపు ఉన్న లారీ డ్రైవర్ సైగ చేస్తూ లారీని ఇంకాస్త ఎడమవైపు తీస్తున్నా బస్ డ్రైవర్ అత్యుత్సాహంతో బస్ ముందుకు పోనిచ్చాడు, అందువల్ల బస్ ముందు భాగం వెల్లింది కాని చివరవైపుకు లారీ తగిలింది. బస్ డ్రైవర్ (ఇద్దరిలొ రెండో అతను) లైట్స్ వేసి నేనున్న వైపు వచ్చాడు. నేనింకా గాజు ముక్కలు ఊడుస్తున్నాను. వచ్చిన డ్రైవర్ ఎవరికీ ఎమీ కాలేదు కదా అని నిర్ధారించుకొని వెల్లిపోయి లైట్స్ ఆపేసాడు. బస్ కదిలింది. మళ్ళీ నేనెళ్ళి ఇంకా గాజుముక్కలు ఉన్నయి వాటిని దులిపేసుకోవాలి లైట్స్ వేయమంటే వేసాడు. మరో రెండు నిముషాలకి మళ్ళీ లైట్స్ ఆఫ్ చేశాడు. కిటికీ అద్దం పగలటం వల్ల విపరీతమైన చల్ల గాలి, హన్మకొండకు ఇంకా రెండున్నర గంటలు అలాగే వెళ్ళాలి.
నేను మళ్ళీ ల్యాప్ టాప్ ఆన్ చేసి పాటలు వింటున్నాను, కాసేపటికి నా చెంపకు ఎదోగట్టిగా తగిలింది. ఏంట అని చూశాను, వెలుతురు లేనందు వల్ల సరిగా కనిపించలేదు. డ్రైవర్ ని లైట్ వేయమని అప్పుడు చుశాను, నా చెంపకు గాజు ముక్క తగిలి రక్తం కారుతోంది. డ్రైవర్ ని ఫస్ట్ ఎయిడ్ కిట్ నుండి దూది ఇవ్వమని అడిగాను, కిట్ లో ఎమి లేవు అని అన్నాదు. ఇంక చేసేది లేక కొన్ని నీళ్ళు తాగి నా రుమాలు తో కాసేపు అదిమి పట్టుకున్నాను. ఇందాక గాజు ముక్కలు దులిపాను కాని అద్దం పగిలినప్పుడు కొంత భాగం కిటికీకే ఉంది అది బస్ వెళ్తున్నప్పుడు గాలి వేగానికి ఊడి నాకు తగులుతుందని అనుకోలేదు.అతిశయోక్తి కాదుగాని నాకు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలప్పుడు కూడా నాకు ఇలాగే ఎదో జరగబోతుంది అనిపించింది. ఈసారి కూడ నేను వింటున్న పాటకు జరిగినదానికి ఎదో సంబంధం ఉన్నట్టనిపించింది.

3 comments:

యడవల్లి శర్మ said...

అయ్యయ్యో..వంశీ గారూ...

ఇప్పుడు ఎలా వున్నారు?

ప్రయాణం చేసేటప్పుడు హనుమంతుడిని స్మరించుకోండి...

మీరు,మీ కుటుంబసభ్యులు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలని కోరుతూ...

Sujata M said...

అయ్యో ! ఇలాంటపుడు కోపం వచ్చినా, ఒక రకంగా ఆనందించొచ్చండీ. పెద్ద ప్రమాదం తప్పింది. మీకిప్పుడు కులాసాగానే ఉండాలని ఆశిస్తాను. పెద్ద దెబ్బ కావలసింది చిన్న గాయంతోనే తీరింది అని అనుకోండి. డ్రైవర్ ని చీవాట్లేశారా ? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ గురించి అధికారులకు చెప్పండి. నేనొకసారి నా కళ్ళారా మృత్యువును (రోడ్ ఆక్సిడెంట్) చూసాను. కను రెప్ప పాటులోనే ప్రమాదాలు జరుగుతాయి. మీ విషయంలో జరిగినది దురడృష్టకరమైన సంఘటనే అయినా, చిన్న సంఘటన కాబట్టి కొంచెం లో కొంచెం ఊరట.

మీకు గాయం త్వరగా తగ్గాలని కోరుకుంటున్నాను.

Vamshidhar said...

నేను ఇప్పుడు బాగున్నాను. నా క్షేమాన్ని కోరుకున్నందుకు ధన్యవాదాలు. ఎవరూ ఇలాంటి ప్రమాదాల బారిన పడకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.