Thursday, March 5, 2009

యు. ఎస్. L1 B వీసా ఇంటర్వ్యు - 25th Feb, 2009

ఫిబ్రవరీ చివరి వారంలో నేను యు. ఎస్. L1 B వీసా ఇంటర్వ్యు కోసం నేను చెన్నై కి వెళ్ళాను. అప్పుడు జరిగిన విషయాలను మీ ముందుంచుతున్నాను. ముందుగా 25th Feb, 2009 నాటి సంగతులు చెబుతాను. 26th Feb, 2009 నాటి సంగతులు మరో టపాలో.
పదింటికి ఆఫీస్ చేరుకున్నాను. నేను 23, ఫిబ్రవరీ రోజు నుండి కొత్త ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాను. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి నాలెడ్జ్ ట్రాన్స్ ఫర్ అవుతుంది.యు. ఎస్. L1 B వీసా ఇంటర్వ్యు కోసం నేను చెన్నై కి ఈ రోజు సాయంత్రం 5 గంటల 20 నిముషాల జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ ఎక్కాలి. 'మేరు కాబ్స్' కి నిన్ననే ఫోన్ చేసి ఆఫీస్ కి రెండింటికి రమ్మని చెప్పాను. రూం కి వెళ్ళి అక్కడి నుండి శంషాబాద్ కి వెళ్ళాలి. సరిగ్గా రెండింటికి కాబ్ డ్రైవర్ వచ్చి కాల్ చేసాడు. లంచ్ చేయకుండా, ఒక పన్నీర్ పఫ్ , ఒక బాదం మిల్క్ తీసుకున్నాను. మా కొలీగ్ సంతోష్ కూడా నాతో పాటుగా విసా ఇంటర్వ్యు కి వస్తున్నాడు. ముందు మాధాపుర్ లో తన రూం కి వెళ్ళాం. తను రెడీ అయ్యేలోపు నేను పఫ్, బాదం మిల్క్ లతో లంచ్ అయ్యింది అనిపించాను. ఆ తరువాత మా రూం కి వెళ్ళాం. పది నిముషాల్లో నేను రెడీ అయ్యాను. మూడింటికి కొండాపూర్ నుండి శంషాబాద్ కి బయలుదేరాము.
గతం లో ఫ్లైట్ లో వెళ్తున్నానంటే ఏదో ఎగ్జైట్మెంట్ ఉండేది. ఈసారి మాత్రం అలాంటిది ఏమీ లేదు. వారం క్రితం యు. ఎస్. వీసా ఇంటర్వ్యు కోసం మా కంపనీలో ఒక చిన్న సెషన్ పెట్టారు , వీసా ఆఫీసర్ అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానలివ్వాలి అని. ఆ సెషన్ తరువాత అనుకున్నాను ఒక గంట సమయం తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అని కాని అప్పటి నా ప్రాజెక్ట్ పని వల్ల అది వీలు పడలేదు. కాసేపు అయ్యాక ఇంటికి ఫోన్ చేసాను. ఆ తరువాత చెన్నై లో ప్రముఖ కంపనీల్లో పని చేస్తున్న నా డిగ్రీ ఫ్రెండ్ రంజిత్ కి ఫోన్ చేసాను రాత్రి కి వీలైతే కలుద్దామని, అలాగే నా స్కూల్ ఫ్రెండ్ నాగరాజు కి కూడా. నలభై ఐదు నిముషాలకి ఎయిర్ పోర్ట్ చేరుకున్నాము.
జెట్ ఎయిర్ వేస్ కౌంటర్ వద్ద మా ఈ-టికెట్ మరియు ఫోటో ఐడెంటిటీ చూపెట్టి బోర్డింగ్ పాస్ తీసుకొని అక్కడే కూర్చున్నాము. సంతోష్ కాసేపు ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవుతానని అన్నాడు, నేను మాత్రం అక్కడే ఉన్న ల్యాండ్ మార్క్ షాపులో కాసేపు టైం పాస్ చేసాను. 4 గంటల 40 నిముషాలకి లోపలికి వెళ్దాము అనుకున్నాము, కాని అప్పటికే టైం ఐదు కావచ్చింది. ఇక కాస్త పరుగులాంటి నడకతో (నా నడక పరుగులాగే ఉంటుందంటారు నా మిత్రులు) లోపలికి వెళ్ళాము. మేము అలా బయలు దేరుతుండగా నాకు మా పేర్లు అనౌన్సుమెంట్ లో వినిపించాయి. ఎదో సినిమాల్లో ఇలా వినిపిస్తాయి అనుకునే వాడిని మొత్తనికి కాసేపు మా పేర్లు ఎయిర్ పోర్ట్ లో వినిపించాయన్నమాట. ఐతే అది మా ఇద్దరికి ఆఖరి కాల్ అన్నమాట. మేము మరొక్క నిముషం ఆలస్యం చేసినా ఇంక ఫ్లైట్ మిస్సయ్యే వాళ్ళము. మొత్తానికి మాతో పాటు మరోకతని పేరు కూడా పిలిచారు. మేము అక్కడికి వెళ్ళగానే ఒక లేడీ మా బోర్డింగ్ పాస్ చెక్ చేసి మాకు ఒక గేట్ వైపు వెళ్ళమని చెప్పింది. మరో జెంటిల్ మెన్ వాకీ టాకీ లో 'పాసెంజర్స్ ఫౌండ్ ' అని సందేశమిచ్చాడు. గేట్ కి అవతల వైపు ఒక బస్ వుంది అందులో మేము ముగ్గురం (అంటే మిస్సైన వాళ్ళామన్నమాట) ఎక్కాము. ఆ ఇద్దరి హడావిడి చూస్తుంటే నాకు ఆదిత్య 369 సినెమాలో బాలకృష్ణ, మోహిని, సుత్తివేలు కాల యంత్రం (టైం మిషన్) లో భవిష్యత్తులోకి వెళ్ళాక శుభలేక సుధాకర్ చేసే హడావిడి గుర్తుకొచ్చింది.ఫ్లైట్ ఎక్కే ముందు ఎయిర్ హోస్టెస్ 'గుడ్ ఈవినింగ్ సర్! హావ్ యే ప్లెజెంట్ జర్నీ' అంది నవ్వు పులుముకున్న మోముతో.
నా సీటు విండో పక్కన, నా పక్క సీటు సంతోష్ కు. ఫ్లైట్లో ఎలా వుండాలో, ఏం జాగర్త్తలు తీసుకోవాలో అంటూ ఒక ఎయిర్ హోస్టెస్ మరో ఎయిర్ హోస్టెస్ వచ్చి అందరిని ఫుడ్ ప్రిఫరెన్స్ అడిగి తెలుసుకుంది. నేను నాన్-వెజ్ అని సంతోష్ వెజ్ అని చెప్పాము. మేము మాట్లాడు కుంటున్నాము. ఫ్లైట్ టేక్ ఆఫ్ అప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు తనకు కొంచం భయం గా అనిపిస్తుందని చెప్పి నాకెలా ఉంటుంది అని అడిగాడు. నాకు మాత్రం ఎమీ భయం లేదు అని చెప్పాను. ఇంకాసేపట్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అందుకే సంతోష్ కి ఏమి కాదు అంటు గతం లో నేను బెంగళూర్ లో మిత్రులతో శివసముద్రం లో వెళ్ళినప్పటి సంగతి చెప్పాను. ఈలోపు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది. నాకెలా ఉంది అంటే 'గాల్లో తేలినట్టుంది ' సంతోష్ కి మాత్రం 'గుండె జారినట్టుం 'దేమో. కిటికీలోంచి కిందకి చూస్తున్నాను, కింద బొమ్మల కే బొమ్మరిల్లు లాగ ఇల్లు ఇంకా కనిపిస్తున్నాయి, పక్కన మబ్బులు. నాకు 'దూరాన నీలి మేఘాలు, నాలోన కొత్త భావాలూ అంటూ ఒక కథనాయిక పాడిన పాట గుర్తుకొచ్చింది. దూరాన ఉంటేనే అని భావాలైతే మరి ఇంత దగ్గరగా ఉంటే?
ఎయిర్ హోస్టెస్ వచ్చి అందరికి ఫుడ్ సర్వ్ చేస్తుంది. నాన్-వెజ్ అని చెప్పను కదా నాకు రెండు డబల్ రోటీ ఇచ్చి వాటితో చికెన్ కీమా లాంటిది ఇచ్చారు, తింటున్నాను, ఎలా వుంది అని అడిగాడు సంతోష్ 'చెత్తగా ఉంది ' అన్నాను నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో ఎమ్మెస్ లా. ఈ లోపు ఎయిర్ హోస్టెస్ వచ్చి కాఫీ కాని టీ కాని కావాలా అని అడిగింది. నాకు కాఫీ, టీ అలవాటు లేదు. పాలు మాత్రం తాగుతాను. కాబట్టి నేను వద్దన్నాను. సంతోష్ కాఫీ కావాలని అన్నాడు, కాఫీ ఐపోయింది అని మళ్ళీ తీసువస్తానని ఆమె వెళ్ళిపోయింది. 'ఇంత ఎత్తులో ఉండి ఇదివరకు టీ తాగాను, ఈ సారి కాఫీ తాగాలనుకుంటున్నాను ' అన్నాడు. నేను ఇంకా కష్టంగా తింటూనే ఉన్నాను. ఆమె వచ్చి కాఫీ ఇచ్చి నన్ను అడిగింది. నేను కాఫీ అన్నాను, ఈలోగా అది బాగాలేదని సంతోష్ చెప్పాడు నేను వెంటనే కాఫీ వద్దు టీ కావాలని చెప్పాను, కాస్త నవ్వుతూనే అలాగే చూస్తూ తెస్తానని వెళ్ళింది. అవును మరి ముందు అడిగినప్పుడు వద్దన్నాను తరువాత కావాలన్నాను మళ్ళీ వేరేది అడిగాను. మేము నవ్వుకున్నాము. నేను తినటం పూర్తి చేసాను. మళ్ళీ నాకు కళ్యాణ రాముడు చిత్రంలో హాస్య సన్నివేషం గుర్తొచ్చి ఇంకాసేపు నవ్వుకున్నాను. ఈ లోపు టీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది, అందులో చక్కెర కలుపుకొని తాగాను, అంత బాగోలేదు, ఇంక ఒక్క సారి కళ్ళు మూసుకొని ఒక్క గుటకలో తాగేసాను.
మేము కూర్చున్నవైపు కాక మరో వైపు సూర్యుడు నన్ను పిలుస్తున్నట్టుగా కిరణాల్ని నా కళ్ళకు కొడుతుంటే అటు చూశాను. చిన్నప్పుడూ ఎందుకో గుర్తులేదు కాని సుర్యుణ్ణి తదేకంగా చూసేవాడిని. అలా చూశాక కాసేపటికి సూర్యుడు గుండ్రంగా , ఆ వెలుగు కిరణాలు చుట్టూ అత్భుతంగా కనిపిస్తుంది, ఇంక మన చుట్టూ ఎమీ కనపడదు. ఇప్పుడు కూడా అలాగే చూద్దామనుకున్నాను కాని తన షిఫ్ట్ ఐపోయింది అన్నట్టుగా ఇంక అస్తమించనున్నాడు, ఆ దృష్యం చాలా బగుంది.
అంతకు ముందు నుండి ఫ్లైట్లో ఏవో హిందీపాటల సంగీతం వినిపిస్తూనే ఉంది కాని ఇప్పుడు ఒక మధురమైన పాట సంగీతం వినిపిస్తుంది. ఆ పాట అమితాబ్, రేఖ నటించిన సిల్ సిలే చిత్రం లో, కిషోర్ కుమార్ గారు, లతా మంగేష్కర్ గారు పాడిన 'దేఖ ఏక్ ఖ్వాబ్ తో యె సిల్సిలే హువే' పాట. ఆ పాటని వింటూ ఉండగానే, అనౌన్సుమెంట్ వినిపించింది. 'వెల్కం టూ చెన్నై ' అని. కిటికీ లోంచి చూసాను 'కామరాజ్ ఎయిపోర్ట్ ' అని కనిపించింది. ఫ్లైట్ ఆగాక దిగి జెట్ ఎయిస్ వేస్ బస్ ఎక్కి బయటికి వచ్చాము. గాల్లో తేమ ఎక్కువగా ఉన్నది. అక్కడ ఒక డ్రైవర్ Santosh and Vamshidhar అని ఒక బోర్డ్ పట్టు కొని ఉన్నాడు. ఆహా మన పేరు కూడా ఇలా పట్టుకుని మనకోసం ఉంటారని అనుకోలేదు. ఇదే అంటూ సంతోష్ కూడా నవ్వాడు. తన దగ్గరికి వెళ్ళి మేమే అని చెప్పాము. మమ్మల్ని కారు దగ్గరకు తీసుకు వెళ్ళాడు. అది టయోట కారు (నాకు కార్ల గురించి తెలియదు, అది యే మాడల్ కారో కాని చాలా రాయల్ గా ఉంది). ఇద్దరం కారెక్కి మాకు రూం కేటయించిన హోటల్ కి బయలు దేరాము. వెళ్తూ ఉండగా, ఇంటికి ఫోన్ చేసాను, అలాగే చెన్నైలోని నా మిత్రులకి ఫోన్ చేసి వీలైతే కలవమని చెప్పాను. ఎయిర్ పోర్ట్ నుండి ట్రైడెంట్ హోటల్ కి పన్నెండు నిముషాల ప్రయాణం.
హోటల్ బాగుంది. రిసెప్షన్ దగ్గర చెక్ ఇన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాము. నాకు 160 వ గది, సంతోష్ కి 162 వ గది తాళాలు ఇచ్చరు. గదులు చాలా చాలా బాగున్నాయి. రూం కి వెళ్ళి ఫ్రెష్ అయ్యక రేపటి ఇంటర్వ్యూకి ప్రెపర్ అవుదామని ఎం ప్రష్నలడుగుతారో అనుకొని అవి లిస్ట్ చేసాము. ఒక సారి అలా బయటకి వెళ్దామని బయలు దేరుతూ మళ్ళీ మా మిత్రులకి ఫోన్ చేసాను, కాని ఆఫీస్ పని వల్ల ఇంకా ఆఫీస్ లోనే ఉన్నరు, నేను వీలైతే రేపు కలుద్దాము అని చెప్పాను. ఆ తరువాత అక్కడ చుట్టు ప్రక్కల తినడానికి ఎదైనా హోటల్ ఉంటుందేమో నని చూసాము కాని దొరకలేదు, అలా ఒక పావుగంట నడిచాక ఒక చిన్న హోటల్ కనిపించింది. ఒక ప్లేట్ ఇడ్లీ , ఒక మసాల దోస అని చెప్పము, అవి లేవు , ఆనియన్ దోస ఉందన్నాదు, సరే రెండు తెమ్మని చెప్పాను. ఎదో తమిళ్ పాట వినిపిస్తుంది రేడియోలో, సంగీతం బాగుంది. ఈ లోగా దోస పట్టుకు వచ్చడు దానికి ఆలు కుర్మా ఇచ్చాడు, నేను చట్నీ అడిగే సరికి టమాటో చట్నీ ఇచ్చాడు. ఇక తినడాం మొదలెట్టను. అది అంతగా రుచించలేదు. ఆకలి రుచెరుగదంటారు కదా. నాకు అలా ఎమి లేదు రుచిగా ఉంటేనే ఒక ముద్ద ఎక్కువగ తింటాను. ఇంతలో ప్రశాంత్, రోజా నటించిన చామంతి చిత్రం ళో గాన గంధర్వుడు మన బాలు గారు పాడిన 'ఇదే రాజయోగం' పాట సంగీతం వినిపించింది. పాట మొదలయ్యింది తమిళ్ లో ఆ పాటని మన మనో పాడాడు, ఆ మధురమైన పాటని వింటూ దోస తిన్నాక, డబ్బులు ఇచ్చి హోటల్ వైపు నడిచాము.
హోటల్ చేరుకున్నాక మరో అరగంట ప్రిపేర్ అయ్యాం. ఇంక గుడ్ నైట్ చెప్పుకొని నిద్రకుపక్రమించాము.

Saturday, January 31, 2009

'పద్మశ్రీ' డాక్టర్ బ్రహ్మానందానికి జన్మదిన శుభాకాంక్షలు


'పద్మశ్రీ' డాక్టర్ బ్రహ్మానందానికి జన్మదిన శుభాకాంక్షలు
బ్రహ్మానందం అంటే హాస్యం; హాస్యం అంటే బ్రహ్మానందం.ఆ మహా నటునికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.
నేను గీసిన బ్రహ్మానందం చిత్రాల చిత్తరువు.నా జీవితంలో ఒక్కసారైన బ్రహ్మానందం కలవాలని, ఈ చిత్రాన్ని బహూకరించాలని అనుకున్నాను, కాని ఇప్పటి వరకు నేను కలవ లేక పోయాను.ఇప్పుడు 'పద్మశ్రీ' వచ్చిన సందర్భంలో అందరికి చూపిస్తున్నాను.

Wednesday, January 28, 2009

నాలో నేను (సాఫ్ట్ వేర్ ఇంజనీర్)

ఇతణ్ణెక్కడో చూసినట్టుందే?
ఎక్కడ చూసాను?
ఆలోచనలోకి వెళ్ళిపోయాను.
కొంచం గుర్తొస్తున్నట్టుంది.
ముఖంలో ఇంత ఉదాసీనతలేదు.
ఇది వరకు చూసినప్పుడు ఇలా గడ్డం లేదు.
అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది.
కారణం ఏంటీ?
ఇది వరకు చూసిన విషయం గుర్తుచేసుకునేందుకే ఇంత సమయం పట్టింది. ఇంక తను ఎందుకు ఇలా ఉన్నాడని ఏం ఆలోచించను? అతణ్ణే అడగాలి అనుకుని కళ్ళతోనే అడిగాను 'ఏంటీ? ఇలా ఉన్నారు?' అని.

'పని ఒత్తిడి వల్ల ఇలా అయ్యా'ను అన్నాడు.
'మరీ అంత పని ఉంటుందా? నీ సహోద్యోగుల మాటేంటి?'
'వారిలో కొందరి పరిస్థితి కూడా ఇంతే.'
'మిగతావారు?'
'ఎక్కడైనా ఉండేదే కదా. కొందరు పని చేస్తారు, కొందరు పని చేయించుకుంటారు, కొందరు చేయలేకున్నా కాలం నెట్టుకొస్తారు. ఐతే ఎంత సేపు పని గురించే తప్ప వేరే మాట్లాడలేము, ఎందుకంటే'
'ఇంతకు ముందు కూడా ఇలాగే పని చేసేవాడివి కదా?'
'అవును, కాని అప్పుడు కొంత సమయం పనిని పూర్తిగా మరచిపోయి కుటుంబ సభ్యులతోనో, మిత్రులతోనో లేదా తెలిసినవాళ్ళెవరితోనో కాసేపు మాట్లాడినా మనసుకి కాస్త హాయనిపించేది. అప్పుడప్పుడు చక్కని సంగీతాన్ని వింటూనో, మంచి సాహిత్యాన్ని చదువుతూనో లేదా నా అభిరుచికి తగిన ఇతర పనులతో నన్ను నేను ఉత్సాహపరచుకునే వాడిని. ఇప్పుడు అసలు ఆ సమయం దొరకటం లేదు.'


'తీరిక దొరకడం లేదు అంటే ఎలా? వృత్తికీ, వ్యతిగతానికీ మధ్య సమతుల్యం పాటించాలి '
'అవును, అనుకోవటం బాగుంటుంది. చెప్పడం మరీ సులువు. కాని ఇప్పుడు మనం ఎంత తీరిక చేసుకుంటే పని అంతగా పెరుగుతుంది. అసలు ఎంత సేపు పని గురించే తప్ప వేరే అలోచన ఎక్కడుంది? ఇది ఆచరణలో అందరికి సాధ్యం కాకపోవచ్చు '
'అవును అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాని నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావు?'
'అనుకోవడానికి ఏముంది? ప్రస్తుతానికి ఈ పని ఇలాగే మరో రెండు నెలలు ఉండొచ్చు. ఆ తరువాతైనా నేను 'నాలా' బ్రతకాలి. 'నేనూ - అంటే కేవలం ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని మాత్రం కాదు. నాలో ఉన్న అభిరుచులకు మెరుగులు దిద్దుకొని నన్ను నేను ఆనంద పరచుకుంటూ ఇతరులని ఆనంద పరుస్తాను '

'చిన్నా! ఈ రోజు ఆఫీసుకి తొందరగా వెళ్ళాలి అన్నావు కదా' అమ్మ మాట చెవినబడేసరికి అర్థమైంది ఇప్పటి వరకు నేను నాతోనే మాట్లాడుకున్నానని.
'ఏంటన్నయ్యా! ఎప్పుడు లేనిది ఈ రోజేంటి అద్దం వదలడం లేదు? పార్టీ కి వెళ్తున్నావా?' సరదాకి చెల్లి అన్న మాటలకు నాన్న అమ్మ నవ్వుకున్నారు.
ఈ నవ్వులు నాకు ఈ రోజుకి ఆక్సీజన్లా పనిజేస్తాయి అనుకొని ఆఫీసుకి బయలుదేరాను.

గమనిక:
పైన పేర్కొన్న విషయాలు వాస్తవమే కాని దీన్ని ఒక కథలా చెప్పాలన్న ఉద్దేశ్యం తో చివరలో అమ్మ, నాన్న మరియు చెల్లి అని ముక్తాయింపు ఇచ్చాను. ఇది ఈ మధ్య నా పుట్టినరోజున జరిగిన సంఘటనే.

Sunday, January 4, 2009

Monday, December 1, 2008

రాజు - పేద

రాజు - పేద
నేను ఈ మధ్య మార్క్ ట్వెయిన్ రాసిన 'ది ప్రిన్స్ అండ్ ది పాపర్ ' నవల సంక్షిప్త కథ 'రాజు - పేద ' గా తెలుగులో చదివాను. కథ మరియు కథనం బాగుంది. ఈ కథ 1530 సంవత్సరంలో పుట్టిన ఇద్దరు పిల్లల కథ. ఒకడు టాం కేంటీ, బిచ్చమెత్తుకునే నిరుపేద కుటుంబంలో జన్మించాడు. మరొకడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ఇంగ్లాండు యువరాజు.
కథ చదువుతున్నప్పుడు ఇద్దరు పిల్లల కష్టాలకి కొంత బాధ కొంత జాలి కలుగుతాయి. ఇక టాం కేంటీ తండ్రి పాత్ర చాలా కొడుకును బిచ్చమెత్తుకొమ్మని ఆ వచ్చిన డబ్బులు తనకివ్వమని ఊరికే కొడుతుంటాదు. అనుకోని పరిస్థితిలో యువరాజు, టాం ఒకరి స్థానాల్లొకి ఒకరు మారిపోతారు ఆ తరువాత కథ ఎన్నో మలుపులు తిరిగి చివరికి సుఖాంతమవుతుంది.
కథ చదివాక తెలుగు చిత్రం 'రాజు-పేద ' చూసాను.
ఈ నవల ఆధారంగా తెలుగులో 1954 సంవత్సరంలో వచ్చిన తెలుగు చిత్రం 'రాజు-పేద '. కేవలం మూల కథలోని ప్రధాన పాత్రలని, కథను మాత్రమే తీసుకొని చిత్రం కోసం కొన్ని మార్పులు చేశారు. ఈ చిత్రాన్ని చూసే ముందు నాకు తెలిసిన విషయాలు రెండు. ఒకటి ఇది నట సార్వభౌముడు ఎన్.టీ.ఆర్. చిత్రము అని, రెండు 'జేబులో బొమ్మ .. జేజేలా బొమ్మ..' అనే పాటను రేలంగి పై చిత్రించారని.
కథ ముందే చదివాను కనుక నాలో రెండు ప్రశ్నలు మెదిలాయి.
1) చిత్రంలో ఎన్.టీ.ఆర్. పాత్ర యేమిటి?
2) మూల కథలో రేలంగి పాత్ర యేమిటి?
ఈ కథను చిత్రంగా మలచేటప్పుడు పిల్లల కథను, ఎన్.టీ.ఆర్. తో యువకుల కథ చేసారేమో అనుకున్నను. చిత్రం మొదలవగానే అది నిజం కాదని తెలిసింది. ఒక పిల్లవాడు యువరాజుగా కనిపించాడు. ఇక కథలోని ప్రధాన పాత్రలు మహరాజు మరియు మైస్ హెండేన్ (టాం కెంటీ ని, ఆ తరువాత యువఋఅజుని కాపాడే పాత్ర). మహారాజు గా మహానటుడు ఎస్. వీ. ఆర్. కనిపించాడు.
ఇక తప్పక ఎన్.టీ.ఆర్. యువరాజు కాపాడే మైల్స్ హెండేన్ పాత్ర పోషింఛాడనుకున్నాను కాని కాసేపటికి చిరిగిన మురికి బట్టల్లో నటరత్న టాం కేంటీ తండ్రి జాన్ కేంటీగా కనిపించగానే ఆశ్చర్యపోయాను.
అదే చివరిసారి మనకు ఎన్.టీ.ఆర్. కనబడేది. చిత్రం ఆసాంతం మంకు జాన్ కేంటీనే కనిపిస్తాడు. నటరత్న నటనకు వేవేల వందనాలు. ఈ చిత్రం ఎన్.టీ.ఆర్. చిత్ర రంగలో ప్రవేసించిన కొత్తలో చేసినా, జాన్ కేంటీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అత్భుతంగా నటించాడు. అందుకే ఆయన మహా నటుడు.
ఇక మూల కథలోని మైల్స్ హెండేన్ పాత్రనికి కాస్త హాస్యాన్ని జోడించారు. ఈ పాత్ర రేలంగి గారు పోషించారు.
పాత చిత్రాలను అభిమానించేవారు ఈ చిత్రాన్ని తప్పక చూడండి.

Wednesday, November 5, 2008

మా-మే-ము (మా మేనల్లుడి ముచ్చట్లు)

మా మేనల్లుడు కౌశిక్ (ఇంట్లో అందరు బాబీ అని పిలుస్తాము, నేను 'చిక్కిరీ అని పిలుస్తాను) వయసు రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు. చాలా తెలివిగలవాడు. ఏదైన విశయాన్ని చెప్పినా లేదా చూసినా దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాడు. అలాగే ప్రతి విశయాన్ని చాలా వివరంగా తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలడుగుతూవుంటాడు. ఎవరినీ బధ పెట్టడు. అందుకు కొన్ని ఉదాహరణాలు.....

1) 'చిన్ని వర్ణం'
మా చెల్లి జ్యోతి (కళా జ్యోతి) కి వినాయకుడు అంటే చాలా భక్తి, అదే మా బాబి కి కూడా అలవాటైంది.
పోయిన వినాయక చవితినాడు పూజ చేసాక 'శుక్లాం భరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వధనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే' అన్న శ్లోకం నేరిపిచింది. శ్లోకం చెప్పమన్నప్పుడు ఇలా చెప్పాడు - 'శుక్లాం భరదరం విష్ణుం షషి వర్నం చిన్ని వర్ణం'. నన్ను మా చెల్లి చిన్ని అని పిలుస్తుంది, మా బాబి కి ఈ సంగతి తెలుసు. అన్నయ్య పేరు శశి (శశిధర్). ఐతే శ్లోకంలో పెద్ద మామయ్య పేరు వచ్చింది కదా చిన్న మామయ్య పేరు రాలేదు కదా, చిన్ని బాధపడతాడు అందుకే అలా చెప్పాను అని నవ్వాడు.

నా భావాలు - నా రంగులు

నా భావాలు:
http://www.siliconandhra.org/monthly/2006/march2006/index.html
http://www.telugupoetry.com/Vamshidhar.php
http://telugupoetry.com/bestwinning.php
http://www.poetry.com/Publications/display.asp?ID=P4134249&BN=999&PN=1
నా రంగులు:
http://www.myntra.com/designerproducts/94/Vamshidhar

ఆశలకేం అనంతం

ఆశలకేం అనంతం

ఎప్పుడూ నిను చూస్తూ వుండాలని...
ఆశలకేం అనంతం
ఎప్పుడూ వుంటుందా వసంతం?.

ఎప్పుడూ నీ పలుకులు వినాలని...
ఆశలకేం అనంతం
పగలెలా వినిపిస్తుంది వెన్నెల గీతం!.

ఎప్పుడూ ఇలాగే ఉండాలని...
ఆశలకేం అనంతం
ఎలా ఆగుతుంది "కాల రథం"?.

మనమిద్దరం చుక్కల తీరం చేరాలని...
ఆశలకేం అనంతం
అయినా ఎగిరిపోగలమా అమాంతం!.
* *

తినుబండారాల నిల్వ తేదీ (ఎక్స్పరీ డేట్)

ఎక్స్పరీ డేట్ (నిల్వ తేదీ)
మీరు బస్ స్టేషన్ లోనో, రైల్వే స్టేషన్ లోనో కొనే తినుబండారాలను కొనేముందు దయచేసి వాటి ఎక్స్పరీ డేట్ చూసుకోండి. ఆ తినుబండారాలు ఖజ్జూరాలు, చెర్రీలు లాంటివైనా, ఆప్పీ, ఫ్రూటీ, మజా, పెప్సీ, స్ప్రైట్ లాంటి పానీయాలైనా వాటి ప్యాకేజి మీద ఉన్న నిల్వ తేదీ (ఎక్స్పరీ డేట్) చూసుకోండి. అసలే బస్ స్టేషన్ , రైల్వే స్టేషన్ లో వాటి ధర బయటి కంటే మూడు నుండి ఐదు రూపాయలు ఎక్కువే ఉంటుంది, ఐతే మాత్రం డబ్బులిచ్చి అనారోగ్యాన్ని కొనుక్కోలేము కదా.

హం న సంఝే థే , ఖ్వాబ్ షీషే హై, దునియా పథ్థర్ కీ (నేననుకోలేదు, కల అద్దమని, ఈ లోకం రాయిలాంటిదని)

ఒక చిన్న ప్రమాదం అక్టోబర్ 31న రాత్రి పది గంటలకు ఎం.జీ.బీ.ఎస్. బస్ స్టేషన్ లొ బస్ ఎక్కి నేను హైదరాబాద్ నుండి హన్మకొండ కి బయలుదేరాను. ఎందుకో బస్ ఎక్కే ముందు ఎదో జరగనుంది అని నాకనిపించింది. బస్ లో చివరి నుండి రెండో వరుసలో నేను కిటికీ సీటులో కూర్చున్నాను.
బస్ భువనగిరి కి దగ్గరలో ఉంది. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా ల్యాప్ టాప్ లో పాటలు వింటున్నాను. గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం గారంటే నాకెంతో అభిమానం, నా జీవితంలో ఒకసారైనా ఆ మహానుభావుడిని కలవాలని నా కోరిక. నేను వింటున్న పాట 'గర్దిష్' చిత్రంలోని 'హం న సంఝే థే ' పాట. ఆ పాట వింటూ బాలు గారి స్వరమాధురిలో తేలిపొతున్నాను.
ఆ పాటలో మొదటి చరణం తరువాత మళ్ళీ పల్లవి వినిపిస్తుంది. ఆ పాట పల్లవి ఇది 'హం న సంఝే థే , ఖ్వాబ్ షీషే హై, దునియా పథ్థర్ కీ'. సరిగ్గా అప్పుడే ఎమైందో తెలియదు కాని నా ఎడమ చెంప వైపు చల్లగా గాలి తగిలింది, ఆ తరువాత గమనించా నా ఒంటి పైనా, ల్యాప్ టాప్ మీద చిన్న చిన్న గాజు ముక్కలు, ఒక్కసారిగా ఎడమవైపు చూశా కిటికీ అద్దం ముక్కలైంది. వెంటనే నా ల్యాప్ టాప్ ఆఫ్ చేసాను. బస్ ఆగింది. జరిగింది ఎమిటంటే ఎడమ వైపు ఉన్న లారీ డ్రైవర్ సైగ చేస్తూ లారీని ఇంకాస్త ఎడమవైపు తీస్తున్నా బస్ డ్రైవర్ అత్యుత్సాహంతో బస్ ముందుకు పోనిచ్చాడు, అందువల్ల బస్ ముందు భాగం వెల్లింది కాని చివరవైపుకు లారీ తగిలింది. బస్ డ్రైవర్ (ఇద్దరిలొ రెండో అతను) లైట్స్ వేసి నేనున్న వైపు వచ్చాడు. నేనింకా గాజు ముక్కలు ఊడుస్తున్నాను. వచ్చిన డ్రైవర్ ఎవరికీ ఎమీ కాలేదు కదా అని నిర్ధారించుకొని వెల్లిపోయి లైట్స్ ఆపేసాడు. బస్ కదిలింది. మళ్ళీ నేనెళ్ళి ఇంకా గాజుముక్కలు ఉన్నయి వాటిని దులిపేసుకోవాలి లైట్స్ వేయమంటే వేసాడు. మరో రెండు నిముషాలకి మళ్ళీ లైట్స్ ఆఫ్ చేశాడు. కిటికీ అద్దం పగలటం వల్ల విపరీతమైన చల్ల గాలి, హన్మకొండకు ఇంకా రెండున్నర గంటలు అలాగే వెళ్ళాలి.
నేను మళ్ళీ ల్యాప్ టాప్ ఆన్ చేసి పాటలు వింటున్నాను, కాసేపటికి నా చెంపకు ఎదోగట్టిగా తగిలింది. ఏంట అని చూశాను, వెలుతురు లేనందు వల్ల సరిగా కనిపించలేదు. డ్రైవర్ ని లైట్ వేయమని అప్పుడు చుశాను, నా చెంపకు గాజు ముక్క తగిలి రక్తం కారుతోంది. డ్రైవర్ ని ఫస్ట్ ఎయిడ్ కిట్ నుండి దూది ఇవ్వమని అడిగాను, కిట్ లో ఎమి లేవు అని అన్నాదు. ఇంక చేసేది లేక కొన్ని నీళ్ళు తాగి నా రుమాలు తో కాసేపు అదిమి పట్టుకున్నాను. ఇందాక గాజు ముక్కలు దులిపాను కాని అద్దం పగిలినప్పుడు కొంత భాగం కిటికీకే ఉంది అది బస్ వెళ్తున్నప్పుడు గాలి వేగానికి ఊడి నాకు తగులుతుందని అనుకోలేదు.అతిశయోక్తి కాదుగాని నాకు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలప్పుడు కూడా నాకు ఇలాగే ఎదో జరగబోతుంది అనిపించింది. ఈసారి కూడ నేను వింటున్న పాటకు జరిగినదానికి ఎదో సంబంధం ఉన్నట్టనిపించింది.